మిషన్ భగీరథ నీళ్లు లీకేజీ
- అధికారుల తీరుపై మండిపడ్డ సభ్యులు..
- మూడు గ్రామాలకు సరిపోయే నీళ్లు వృధాగా పోతున్నాయి
- మండల సర్పంచుల ఆవేదన
తాడ్వాయి,(విజయక్రాంతి): మిషన్ భగీరథ నీళ్లు(Mission Bhagiratha water) వృధాగా పోతున్నాయి. లీకేజీలకు మరమ్మతులు చేయించరా అంటూ మండల సర్పంచులు అధికారుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్పంచులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చందాపూర్ సర్పంచ్ మంగారెడ్డి మాట్లాడుతూ... చందాపూర్ లో ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌస్(Mission Bhagiratha Pump House) నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి, వృధాగా పోయే నీళ్లు మూడు గ్రామాలకు సరఫరా చేయవచ్చని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత మూడు సంవత్సరాల నుంచి నీళ్లు లీకేజీ అయి వృధాగా పోతున్న మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోరా అంటూ మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ విశాల్(Mission Bhagiratha Grid AE Vishal)పై మండిపడ్డారు. లీకేజీ అయిపోతున్న నీటితో చెక్ డ్యామ్ నిండుతుందన్నారు. ఎన్నో గ్రామాల ప్రజలు తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారని, లీకేజీ అయిన నీటిని అరికట్టి ఆ గ్రామాలకు సరఫరా చేయవచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై గ్రిడ్ ఏఈ విశాల్ మాట్లాడుతూ.. ఈ విషయం తనకు తెలియదని లీకేజీలను పరిశీలిస్తామని తెలిపారు.
గ్రామానికి ఒకరోజు నీళ్లు వస్తే మరో రోజు రావడం లేదని తాడువాయి సర్పంచ్ విజయ తెలిపారు. గ్రామాలకు ప్రతిరోజు నీళ్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని దేమికలాన్, కన్కల్ గ్రామాల సర్పంచులు భైరవి, రవీందర్ రెడ్డిలు అధికారులను కోరారు. రాత్రి సమయంలో కరెంటు పోతుంది విద్యుత్ సరఫరా లో ఎందుకు అంతరాయం కలుగుతుంది మీరు చర్యలు తీసుకోరా అంటూ చందాపూర్ సర్పంచ్ మంగారెడ్డి, కన్కల్ సర్పంచ్ రవీందర్ రెడ్డి,కాళోజి వాడి సర్పంచ్ చంద్రారెడ్డిలు ఏఈ ని నిలదీశారు. గ్రామాల్లో స్తంభాలు ప్రమాద స్థితిలో ఉన్నాయి, కరెంటు వైర్లు పశువులకు తాకే విధంగా ఉన్నాయి, అయినా ఎందుకు పట్టించుకోవడంలేదని సర్పంచులు కర్ణాకర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాద స్థితిలో ఉన్న వైర్లను స్తంభాలను పరిశీలిస్తానని ఏ ఈ తెలిపారు. ఎస్సై నరేష్ మాట్లాడుతూ... గణేష్ ఉత్సవాలలో ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని, డీజె లు పెట్టవద్దని సర్పంచులను కోరారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా గ్రామాలలోని సర్పంచులు సహకరించాలని ఆయన సూచించారు. మత్స్యశాఖ అధికారి సమావేశానికి గైరాజర్ అవడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర పహాడ్ నుంచి నందివాడకు వెళ్లే రోడ్డులో కళ్ళు దుకాణం రోడ్డుకు ఆనుకొని ఉందని, దీంతో మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వెంటనే కళ్ళు దుకాణాన్ని అక్కడి నుంచి మార్చివేయాలని నందివాడ సర్పంచ్ సంకు పోచయ్య ఎక్సైజ్ అధికారిని కోరారు.
అదే గ్రామంలో ఉన్నత పాఠశాల పక్కనే మద్యం దుకాణం నిర్వహిస్తున్నారని దీంతో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సర్పంచ్ అధికారిని కోరారు.వెంటనే అక్కడి నుంచి మద్యం దుకాణం మార్చాలని విన్నవించారు. పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించాలని కాలోజివాడి, దేమికలాన్ సర్పంచులు చంద్రారెడ్డి, బైరవి లు ఎంఈఓ రామస్వామిని కోరారు. ఈ విషయమై తాను అధికారులకు ప్రతిపాదనలు పంపుతానని ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్ రావు, ఎంపీడీవో భరత్ కుమార్, తహసిల్దార్ శ్వేత, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.