సంఘటిత శక్తే దేశ రక్షణకు శ్రీరామరక్ష
విజయదశమి ఉత్సవంలో ఆర్ఎస్ఎస్ నేత కరుణాకర్
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో సంఘటిత శక్తే దేశ రక్షణకు శ్రీరామరక్ష అని ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ సంపర్క ప్రముఖ్ జూలపల్లి కరుణాకర్(RSS Leader Karunakar) అన్నారు. (RSS Foundation Day) పురస్కరించుకొని భవానీ నగర్ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో టీచర్స్ కాలనీ సిరి బ్యాంకెట్ హాల్ లో ఏర్పాటు చేసిన విజయదశమి కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడుతూ నాలుగు యుగాల లోనూ ధర్మ స్థాపన జరిగిందని, సత్యయుగంలో జ్ఞాన శక్తి ద్వారా త్రేతాయుగంలో మంత్ర శక్తి ద్వారా ద్వాపర యుగంలో యుద్ధ ధర్మం ఆధారంగా ధర్మం నిలబెట్టబడిం దని తెలిపారు.
ప్రస్తుత కలియుగంలో ధర్మం కేవలం ఒకే పాదంపై నడుస్తోందని, కలియుగం(Kali Yuga)లో 75 శాతం చెడు, 25శాతం మాత్రమే మంచి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టాలంటే ‘సంఘే శక్తి కలౌయుగే’ నినాదంతో, సంఘటన ద్వారా, ఐకమత్యంతో మాత్రమే చెడుపై విజయం సాధించగలమని స్పష్టం చేశారు.భారతదేశంపై అనేక విదేశీ జాతులు దండయాత్రలు చేసినప్పటికీ, మన దేశ సంస్కృతిని కాపాడుకోవడంలో, సమాజంలో ఐకమత్యం పెంపొందించడంలో సంఘ శక్తి ఎంతగానో తోడ్పడిందని ఆయన గుర్తుచేశారు.
డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ అఖండ భారత దేశ చరిత్రను, సంఘ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసి 1925వ సంవత్సరంలో నాగపూర్ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను స్థాపించారని తెలిపారు. కేవలం 15 సంవత్సరాల కాలంలోనే దేశవ్యాప్తంగా శాఖలను విస్తరింపజేసి, దేశ రక్షణకు యువతను సిద్ధం చేశారని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన వివిధ రాజకీయ, సామాజిక సంక్షోభాలు, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలోనూ స్వయంసేవకులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం పోరాడారని గుర్తుచేశారు.
సమాజం జాగృతమై ఉంటేనే ఏ దేశమైనా సుస్థిరంగా, సుభిక్షంగా ఉంటుందని, దీనికి వెనిజులా వంటి దేశాల ఉదాహరణలే నిదర్శనమని హెచ్చరించారు. విజయదశమి అనగా శక్తి ఉపాసన, ఆరాధనకు ప్రతీక అని, ఏ పనైనా విజయదశమి రోజున ప్రారంభిస్తే అది దిగ్విజయంగా పూర్తవుతుందని పేర్కొన్నారు. కలియుగంలో హిందూ సమాజాన్ని ఐక్యం చేస్తూ, వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వేదికపై ఉన్న ఆయుధాలకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ భవాని నగర్ సంఘ చాలక్ చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి, వరంగల్ మహానగర్ ఆర్ఎస్ఎస్ సహ సంఘచాలక్ డాక్టర్ సుధాకర్ రావు పాల్గొన్నారు.