నిలోఫర్ ఆసుపత్రిలో బాధిత చిన్నారులకు ఎమ్మెల్యే పరామర్శ
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన.. కుటుంబ సభ్యులకు భరోసా...
బాన్సువాడ, నవంబర్ 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం(Banswada Rural Mandal) తాడ్కోల్ గ్రామ శివారులోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో ఆదివారం పందుల వేట కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలిన ఘటనలో ఏడుగురు గాయపడగా, క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు దండ్ల అంజలి (3), దండ్ల శ్రీదేవి (5)లను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి(Niloufer Hospital) తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.అనంతరం చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్యులకు సూచించారు.
బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున అవసరమైన వైద్య సహాయం అందేలా చూస్తామని భరోసా కల్పించారు. చిన్నారులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నిలోఫర్ ఆసుపత్రి ఆర్ఎంఓ, ఆసుపత్రి సూపరింటెండెంట్, తాడ్కోల్ సర్పంచ్ రమేష్, మాజీ జడ్పీటీసీ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.