ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఎంఎస్ పోరుబాట...!
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఆల్ ఇండియా ఆర్టీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కైలాష్ చంద్ మాలిక్
బాన్సువాడ,(విజయ క్రాంతి): తెలంగాణలో ఆర్టీసీ కార్మిక(RTC workers) సంఘాల ఎన్నికల్లో తొలిసారిగా బీఎంఎస్ తరఫున పోటీ చేసి, ఓట్లు సాధించిన కార్యకర్తలకు నాయకులు ఆల్ ఇండియా ఆర్టీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కైలాష్ చంద్ మాలిక్(All India RTC Federation General Secretary Kailash Chand Malik) దిశానిర్దేశం చేశారు. గురువారం తెలంగాణలో పర్యటనలో భాగంగా బాన్సువాడ ఆర్టీసీ డిపోను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని, కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు.
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి అమలు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 18న ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, పెన్షన్ విధానం అమలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీపీఎంఎం ఉపాధ్యక్షులు ఆర్ వెంకట్ రెడ్డి,కార్మి క్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి కుమార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవీందర్ గౌడ్ బాన్సువాడ డిపో అధ్యక్షులు ధర్మపాల్ కార్యదర్శి తులసీరామ్ మారుతి మహిళ విభాగం అధ్యక్షురాలు మంజుల కార్యదర్శి విజయ గోపికృష్ణ హనుమాన్లు శివ రతన్ తదితరులు పాల్గొన్నారు.