రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్ డిక్లరేషన్ ఏదీ?

31-10-2026 | 12:08pm

కామారెడ్డి, అక్టోబర్ 31 (విజయక్రాంతి): 2024 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయుల ప్రొబేషన్ డిక్లరేషన్‌తోపాటు పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా చింతల లింగం మాట్లాడుతూ.. 2024 డీఎస్సీ ద్వారా కామారెడ్డి జిల్లాకు నియమితులైన ఉపాధ్యాయులు విధుల్లో చేరి రెండేళ్లు పూర్తి చేసుకున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత ఉత్తర్వులు (Proceedings) జారీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రొబేషన్ డిక్లరేషన్ (Probation Declaration) ఆలస్యం కావడంతో ఉపాధ్యాయులకు రావాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లు, డీఏ బకాయిలు, ఇతర సప్లిమెంటరీ బిల్లులు (Supplementary Bills) పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీంతో నూతన ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత మండల విద్యాధికారులు (MEO), డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (DDO) నుంచి ఉపాధ్యాయుల సర్వీసు, సెలవుల వివరాలను వెంటనే తెప్పించుకుని ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు త్వరగా జారీ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, మండల అధ్యక్షుడు గ్యార బాబయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు