ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది
కొత్తపల్లి, అక్టోబర్ 11(విజయక్రాంతి): బీజేపీ మండల కొత్తపల్లి అధ్యక్షుడు కుంట తిరుపతి(Kunta Tirupati) కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(Special Summary Revision of Electoral Rolls) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి చేయాలని కుట్రలు చేస్తూ, ఈ విషయంలో బిజెపిని బద్నాం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి అన్నారు. ఆదివారం రోజున కొత్త పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్ పైకాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.
చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ గా పారదర్శకంగా సర్ ప్రక్రియను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. అయితే, బోగస్ ఓట్లతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, నిబంధనల ప్రకారం దొంగ ఓట్ల తొలగింపు జరుగుతుంటే ఓటమి భయంతో బీజేపీపై, ఎన్నికల వ్యవస్థపై బురదజల్లే యత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడంలో విఫలమై, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికే ఈ తరహా దుష్ప్రచారాలకు తెరలేపుతోందని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న ఈ తప్పుడు వాదనలను బీజేపీ శ్రేణులు తిప్పికొడతాయని, ప్రజలకు నిజానిజాలు వివరిస్తామని,కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపళ్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్ , రాచకొండ కొమురయ్య, విజయ, సదానందం నాయక్, శ్రీనివాస్ నాయక్, జిట్టవేణి రేణయ్య ననుగొండ ప్రవీణ్ ,కట్ల శ్రీనివాస్ ,ఆర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.