మునుగోడు తాగు, సాగునీటి అవసరాలపై రాజీ పడే ప్రసక్తే లేదు

11-10-2026 | 08:39pm

డిండి ఎత్తిపోతల పథకంపై విశ్రాంత ఇంజనీర్లతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమీక్ష

రూ.1,800 కోట్లతో పనులకు ప్రభుత్వం ఆమోదం

మునుగోడు,అక్టోబర్ 11 (విజయక్రాంతి): ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్‌ ప్రభావంతో(Impact of fluoride) ఇబ్బందులు ఎదుర్కొంటున్న మునుగోడు నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి(Drinking and irrigation water) అవసరాలు తీర్చే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకానికి(Dindi Lift Irrigation Scheme) నీటి తరలింపు, లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు సంబంధించిన పనులపై తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల ప్రతినిధులతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకంతోపాటు మునుగోడు నియోజకవర్గంలోని లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే అంశంపై గత ప్రభుత్వం స్పష్టమైన పరిష్కారం చూపలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన చొరవతో ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించేలా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనుల కోసం ప్రభుత్వం రూ.1,800 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.

ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటి తరలింపునకు సంబంధించి భూసేకరణ, హెడ్‌వర్క్స్‌ నిర్మాణం సహా అన్ని పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానని విశ్రాంత ఇంజనీర్ల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా కృషి చేస్తానన్నారు.

నీటి తరలింపుపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, పనుల పురోగతి, తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, సలహాదారులు వి.వెంకటరామారావు, ఎం.సత్తిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జగదీశ్వర్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు