బాన్సువాడ, చందూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న పోచారం...
బాన్సువాడ, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని డబుల్ బెడ్‌రూం కాలనీలో, చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ మోడల్ స్కూల్‌లో(Victory Model School) నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ఆదివారం ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy), మాజీ ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని 1000 డబుల్ బెడ్‌రూం కాలనీలో ఏర్పాటు చేసిన 44 అడుగుల భారీ బతుకమ్మ ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసుల బాలరాజు ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బతుకమ్మగా నిర్వాహకులు పేర్కొన్న ఈ భారీ బతుకమ్మను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు.ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణం, చందూర్ మండల కేంద్రానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆనందోత్సాహాల మధ్య సందడిగా సాగాయి.ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ పట్టణ, చందూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.