హుజురాబాద్ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు
నాలుగు ప్రధాన కూడళ్లకు మహర్దశ..
రూ.1.50 కోట్లతో సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టిన వొడితల ప్రణవ్
హుజురాబాద్, నవంబర్ 06 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్Congress leader Vodithala Pranav) అన్నారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లను రూ.1.50 కోట్ల వ్యయంతో సుందరీకరించేందుకు శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు.
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ప్రధాన కూడలిలో కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ... పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నాలుగు ప్రధాన కూడళ్ల అభివృద్ధితో పాటు రూ.4.50 కోట్లతో సీసీ రోడ్లు, రూ.2.50 కోట్లతో డ్రైనేజీ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. చిన్నారులు ఆహ్లాదంగా గడిపేందుకు చిల్డ్రన్ పార్కును ఏర్పాటు చేయడంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, గ్రామాల్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సమస్య తలెత్తకుండా రూ.58 లక్షలతో బోర్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన హామీలను కార్యరూపంలో చూపిస్తామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి వేడుకలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు గొప్ప భరోసాగా నిలుస్తోందని ప్రణవ్ పేర్కొన్నారు. ఇళ్లు లేని పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పీసీసీ ఆదేశాల మేరకు 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 2,21,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 5,500 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మైనారిటీ విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.