కరీంనగర్‌ను ‘గ్రీన్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం
ముకరంపుర, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): పార్టీలకతీతంగా నగర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, కరీంనగర్‌ను సుందర, స్వచ్ఛ, హరిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(City Mayor Kolagani Srinivas) అన్నారు. గురువారం నగరంలోని 34వ డివిజన్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు మేయర్ శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ సమీనా పర్వీన్, జమ్ము తో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ, గతంలో గ్రామ పంచాయతీగా(Gram Panchayat) ఉన్న ఈ ప్రాంతం నగరంలో భాగమైన నేపథ్యంలో డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజలకు మౌలిక వసతులు, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.అదేవిధంగా యూఐడిఎఫ్ నిధుల నుంచి మరో రూ.50 లక్షలు వెచ్చించి డివిజన్ లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ప్రజల ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ నందకుమార్, మున్సిపల్ అధికారులు, స్థానిక డివిజన్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.