హుజురాబాద్ బిడ్డకు డాక్టరేట్

02-11-2026 | 05:31pm

హుజురాబాద్, నవంబర్ 02 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన యెదులాపురం రామబ్రహ్మం (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) కుమారుడు యెదులాపురం రంజిత్ కుమార్ ఇంజినీరింగ్ విభాగంలో డాక్టరేట్ (PhD Degree) సాధించారు. ప్రతిష్ఠాత్మక అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (AcSIR) సంస్థ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. పరిశోధనా సంస్థల విభాగంలో జాతీయ స్థాయి ఎన్‌ఐఆర్‌ఎఫ్ (NIRF Ranking) ర్యాంకింగ్స్‌లో ఈ సంస్థ 9వ స్థానంలో నిలవడం విశేషం.

హైదరాబాద్‌లోని జాతీయ పరిశోధనా సంస్థ సీఎస్‌ఐఆర్‌–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT)లో యూజీసీ నెట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సహకారంతో రంజిత్ కుమార్ తన పరిశోధన పూర్తి చేశారు. నానోస్ట్రక్చర్డ్ ఐరన్ ఆక్సైడ్లు, ఎంట్రోపీ ఇంజినీర్డ్ స్పినెల్ ఫెర్రైట్ల తయారీ, విశ్లేషణతో పాటు అయస్కాంత, శక్తి నిల్వ రంగాల్లో వాటి వినియోగంపై పరిశోధనలు (Scientific Research) సాగించారు.

ఆయన పరిశోధనల ఫలితంగా అంతర్జాతీయ స్థాయి పీర్ రివ్యూడ్ జర్నల్స్‌లో మొత్తం 17 పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కృషి, పట్టుదలతో ఉన్నత విద్యా రంగంలో గుర్తింపు సాధించిన రంజిత్ కుమార్ విజయంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన ఘనత హుజురాబాద్ ప్రాంతానికి గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు