ఘనంగా నాగుల చవితి వేడుకలు
హుజూర్ నగర్: పట్టణంలో నాగుల చవితి పండుగ వేడుకలు(Nagula Chavithi Celebrations) అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే మహిళలు, పిల్లలు, భక్తులు పెద్ద సంఖ్యలో పట్టణంలోని నాగమయ్య గుడి(Nagamma Temple) బారులు తీరారు. నాగదేవతల విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ సమర్పించి భక్తితో పాలు పోశారు.
చలిమిడి, వడపప్పు, అరటిపండ్లు తదితర నైవేద్యాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లల ఆయురారోగ్యాలు,దీర్ఘాయుష్షుతో పాటు కుటుంబమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మహిళలు నాగదేవతలను వేడుకున్నారు.భక్తుల రద్దీ, పూజా కార్యక్రమాలతో గుడి ప్రాంతమంత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.ఆలయ నిర్వహణ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.