ఉర్దూ జర్నలిస్టు సాజిద్ ఖాన్‌కు ‘నిషాన్-ఏ-సహాఫత్’ అవార్డు

13-11-2026 | 11:56am

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉర్దూ జర్నలిజంలో విశేష సేవలందిస్తున్న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్టు హాఫిజ్ మహమ్మద్ సాజిద్ ఖాన్‌కు ప్రతిష్ఠాత్మక ‘నిషాన్-ఏ-సహాఫత్’ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ నిర్వహించిన పదో వార్షిక సమావేశంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా ఆయన అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ఉర్దూ జర్నలిజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. గతంలో రెండుసార్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్న సాజిద్ ఖాన్‌కు జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్టులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు