మార్కెట్ పాలకమండలి ఎక్స్టెన్షన్ కు నో..!

13-11-2026 | 11:58am

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ పాలకమండలి పదవీకాలం పొడిగింపు కు ప్రభుత్వం ‘నో’ చెప్పింది. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా అనుమాండ్ల తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ గా గుగులోతు భట్టు నాయక్ సహా 18 మందితో 2024 అక్టోబర్ 23న పాలకమండలిని ప్రభుత్వం నియమించింది.

రెండేళ్ల పదవీకాలం గత నెలలో ముగిసిపోగా, మరో ఆరు నెలల పాటు పాలకమండలి పొడగింపుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పాలకమండలి పదవి కాలాన్ని పొడగించకుండా, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కు మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, హనుమకొండ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధను పర్సన్ ఇన్చార్జిగా ఈనెల 7న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తొర్రూరు మార్కెట్ పర్సన్ ఇన్చార్జిగా ఏటీఎం అనురాధ బాధ్యతలు స్వీకరించినట్టు మార్కెట్ కార్యదర్శి ఖాజా పాషా ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ రెడ్డి తో గత పాలకమండలి చైర్మన్ తిరుపతి రెడ్డికి సఖ్యత లేకపోవడం వల్ల ఎమ్మెల్యే సిఫారసు ‘లేఖ’ పోవడంతో పాలకమండలి పొడగింపుకు ప్రభుత్వం ‘నో’ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సంఘటన తో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

మరిన్ని వార్తలు