'ఇండ్ల' దళారిపై కేసు నమోదు చేయాలి
ఎరుకల నాంచారమ్మ బస్తీలో డబుల్ బెడ్ రూమ్
ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు
మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీకి బాధితుల ఫిర్యాదు
ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ లోని ఎరుకల నాంచారమ్మ బస్తీలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు(Double bedroom houses) ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్(BC People's Federation) వ్యవస్థాపకుడు బొంగు వెంకటేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. భారత ఎరుకల కుల వృత్తుల అభివృద్ధి సేవా సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వనం గంగయ్య, వైస్ ప్రెసిడెంట్ దాసరి గంగాధర్, బాధితులు తదితరులు గురువారం మన్సూరాబాద్ డివిజన్ సౌత్ ఎండ్ పార్కుకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎరుకల నాంచారమ్మ బస్తీలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో ఇండ్లు ఇప్పిస్తామని స్థానికంగా ఉన్న సాగర్ గంగయ్య అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. తనకు రాజకీయ పలుకుబడి ఉందని, అధికారులు వెంట ఉన్నారని అనేక మంది పేదలను మభ్యపెట్టి ఒక్కొక్కరి నుంచి సుమారు రూ, 3 లక్షలు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాధితులు దాసరి మమత, భిక్షమ్మ, ఏకలవ్య కాలనీ నగర్ నాయకులు పాల్గొన్నారు.