రూ.100 కోట్ల ప్రచారమా? రాహుల్‌కు కేటీఆర్‌ ప్రశ్నలు

13-11-2026 | 12:01pm

రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ నిప్పులు.. రూ.100 కోట్ల ఖర్చుపై నిలదీత!

హైదరాబాద్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(BRS Working President KTR) ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తలెత్తినప్పుడు స్పందించని రాహుల్.. ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ము రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రచార కార్యక్రమానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులతో కాంగ్రెస్ అగ్రనేతను నిలదీశారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యలు జరిగినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు, వేధింపులు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన సమయంలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను HYDRA కూల్చివేస్తున్నప్పుడు, హైకోర్టు పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై వివాదం తలెత్తినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేబీఆర్ పార్కు అభివృద్ధి(Development of KBR Park), చెట్ల తొలగింపు అంశాలపైనా స్పందించలేదని విమర్శించారు.

రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినప్పుడు రాజ్యాంగ ప్రక్రియను పట్టించుకోలేదని కేటీఆర్‌ ఆరోపించారు. అసెంబ్లీ ఎదుట మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగాయన్న ఆరోపణలు వచ్చినప్పుడూ రాహుల్ కనీసం స్పందించలేదని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలు, జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు, భూకబ్జాలు, క్రోనీ క్యాపిటలిజం వంటి అంశాలపై కూడా కాంగ్రెస్ అగ్రనేత మౌనం వహించారని విమర్శించారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా అవినీతి గురించి మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో స్పందించకుండా.. ఇప్పుడు భారీగా ప్రజాధనం ఖర్చు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. “అవసరమైనప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడానికి మీకు హక్కు ఎక్కడిది రాహుల్ గాంధీ?” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు