భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టల వద్ద మహిళల ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సౌభాగ్యం, సంతాన క్షేమం కోసం వేడుకున్నారు. హిందూ సంప్రదాయంలో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పర్వదినాల్లో ఒకటైన నాగుల చవితి సందర్భంగా నాగదేవతను ప్రత్యక్ష దైవంగా భావించి పుట్టలకు పూజలు నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు ఆలయాలకు, గ్రామాల్లోని నాగుల పుట్టల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించారు. నాగదేవతను ఆరాధించడం ద్వారా కుటుంబానికి సుఖసంతోషాలు, సౌభాగ్యం, సంతాన క్షేమం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి పాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి నాగేంద్రుడికి భక్తిపూర్వకంగా మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి, దీపాలు వెలిగించి నాగదేవతను కొలిచారు.