మన గణపతి – మట్టి గణపతి
ముకరంపుర,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Karimnagar Mayor Kolagani Srinivas) పిలుపునిచ్చారు. హమారా ఉన్నత మార్గ్ స్వచ్ఛంద సంస్థ(Hamara High Marg Charity Organization) ఆధ్వర్యంలో మన గణపతి – మట్టి గణపతి అనే నినాదంతో రూపొందించిన వాల్ పోస్టర్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని సూచించారు. “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం”అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో మట్టితో తయారు చేసిన గణపతిని ప్రతిష్టించి పూజించాలని ప్రజలను కోరారు.