సీసీఆర్‌బీపై సీపీ ఫోకస్.. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

18-10-2026 | 10:49am

కరీంనగర్ క్రైం, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (CCRB) కార్యాలయాన్ని శనివారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల రికార్డులు, పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ తనిఖీలో భాగంగా క్రైమ్ రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల వివరాలు, నేరస్తుల డేటాబేస్ (Database), క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS) పోర్టల్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేసే విధానంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రికార్డులన్నింటినీ పక్కాగా, డిజిటల్ పద్ధతిలో భద్రపరచాలని సిబ్బందికి సూచించారు. నేర విచారణలో దర్యాప్తు అధికారులకు త్వరితగతిన సమాచారం అందించడంలో సీసీఆర్‌బీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఏసీపీ శ్రీనివాస్ జి, ఇన్‌స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్సై నరేష్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు