కరీంనగర్లో ఉత్సాహంగా 2K వాకథాన్
ముకరంపుర, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నడక (Walking)ను ఒక భాగంగా చేసుకోవాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే నినాదంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు గత 40 ఏళ్లుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవ (Anniversary Celebrations) వేడుకలు ఆదివారం కరీంనగర్లో ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై 2K వాకథాన్ (2K Walkathon)ను ప్రారంభించారు. అనంతరం వాకథాన్ ముగిసిన తర్వాత పాత కలెక్టరేట్ ఆడిటోరియంలో 40వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులందరూ కలిసి 40వ వాకర్స్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా భారీ స్థాయిలో 2K వాకథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన (Health Awareness) పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్లు, డిప్యూటీ గవర్నర్లు, ఆర్సీలు, జెడ్సీలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, బులెటిన్ ఎడిటర్లు, పెద్ద సంఖ్యలో వాకర్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ 304 సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.