విద్యుత్ సమస్యలపై కాలనీవాసుల ఆందోళన

29-11-2026 | 11:16am

ఘట్‌కేసర్, నవంబర్ 29 (విజయక్రాంతి): పట్టణంలోని పలు కాలనీల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యలను (Power Problems) పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ఆదివారం విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన, ధర్నా (Protest) నిర్వహించారు. మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో మేడపాటి నగర్, శ్రీనివాస నగర్, బుగ్గనగర్, కేఎల్ఆర్ నగర్, పటేల్ నగర్ కాలనీలకు చెందిన ప్రజలు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విద్యుత్ శాఖ ఏఈ ఎం. సైదా నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

గతంలో తమ కాలనీలకు మంజూరైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర పరికరాలను సంబంధిత కాంట్రాక్టర్లు ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఇతర ప్రాంతాలు, గ్రామాలకు తరలించి అమర్చినట్లు తమ దృష్టికి వచ్చిందని కాలనీవాసులు తెలిపారు. దీంతో తమ ప్రాంతాలకు మంజూరైన విద్యుత్ సదుపాయాలు అందుబాటులోకి రాక సమస్యలు యథాతథంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తరచూ విద్యుత్ అంతరాయాలు, లో-వోల్టేజ్ (Low Voltage), సరఫరాలో హెచ్చుతగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక భారం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పూర్తిస్థాయి పరిష్కారం లభించకపోవడంతో ధర్నా చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు.కాలనీవాసుల నిరసన అనంతరం ఏఈ ఎం. సైదా నాయక్ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.

మరిన్ని వార్తలు