గుడుంబా స్వాధీనం, బెల్లం పానకం ధ్వంసం

29-11-2026 | 11:11am

మహబూబాబాద్ (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ (Law and Order)లో భాగంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోగళ్లపల్లి గ్రామ శివారు బోరింగ్ తండాలో ఆదివారం తెల్లవారుజామున 5.30 నుంచి 7.30 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (Community Contact Program) చేపట్టారు.

ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేశారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 12 వాహనాలను గుర్తించి తదుపరి చర్యల కోసం పరిశీలించారు.

తండా పరిసరాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 800 లీటర్ల బెల్లం పానకాన్ని నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు రోడ్డు భద్రతా నియమాలు, గంజాయి తదితర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల (Cyber Crimes) పట్ల అప్రమత్తతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లను నిరంతరం నిర్వహిస్తామని గూడూరు సీఐ వినయ్ తెలిపారు.

మరిన్ని వార్తలు