గ్రూప్-3కు రోస్టర్లో న్యాయం చేయాలి!
కరీంనగర్ సిటీ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): విద్య, ఉద్యోగ రంగాల్లో సామాజిక వివక్ష, ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకొని ఎస్సీ గ్రూప్-3 కులాలకు న్యాయం చేయాలని మీసాల మల్లిక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మొదటి 20 రోస్టర్ పాయింట్లలో 5వ, 12వ పాయింట్లను ఎస్సీ గ్రూప్-3కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఆధారంగా 2025 ఏప్రిల్ 14న తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలను మూడు గ్రూపులుగా విభజించిందని తెలిపారు. అయితే ఎస్సీ గ్రూప్-3కు 22వ రోస్టర్ పాయింట్ (Roster Point) కేటాయించడం వల్ల విద్య, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటి 20 రోస్టర్ పాయింట్లలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించినప్పటికీ, ఎస్సీ గ్రూప్-3కు ఒక్క పాయింట్ కూడా కేటాయించలేదని అన్నారు. ఒకటి నుంచి పది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ (Reservation) ఉన్నప్పటికీ, 22వ రోస్టర్ పాయింట్ కారణంగా గ్రూప్-3 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని పేర్కొన్నారు.
గతంలో తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వర్గాలకు ఓపెన్ రోస్టర్ పాయింట్లు కేటాయించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. అదే విధంగా ఎస్సీ గ్రూప్-3కు కూడా మొదటి 20 రోస్టర్ పాయింట్లలో 5వ, 12వ పాయింట్లు కేటాయించి సామాజిక న్యాయం (Social Justice) కల్పించాలని మీసాల మల్లిక్ ప్రభుత్వాన్ని కోరారు.