ఈసీ బంపర్ ఆఫర్.. మరో 3 వారాలు ఛాన్స్!

30-10-2026 | 11:13am

హైదరాబాద్: తెలంగాణ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) గుడ్‌న్యూస్ చెప్పింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారానికి గడువును మరోసారి పొడిగించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ గడువు పెంచుతూ గురువారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నుంచి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారానికి నవంబర్ 5 వరకు గడువు ఉండేది. తాజాగా ఈ గడువును నవంబర్ 26 వరకు పొడిగించింది. దీంతో ఓటర్లు తమ పేర్లపై అభ్యంతరాలు తెలియజేయడానికి, ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయించుకోవడానికి మరో మూడు వారాల అదనపు సమయం లభించింది.

ఈసీ తాజా నిర్ణయంతో తుది ఓటర్ల జాబితా (Final Voter List) విడుదల తేదీ కూడా మారింది. పాత షెడ్యూల్ ప్రకారం నవంబర్ 9న విడుదల కావాల్సిన జాబితాను ఇప్పుడు నవంబర్ 30న ప్రకటించనున్నారు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన ఎన్నికల సంఘం తాజాగా రెండోసారి గడువు పెంచడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు గల్లంతు కాకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు బూత్ లెవల్ అధికారులు (BLOs) వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఎన్నికల సిబ్బందికి అదనపు సమయం లభించనుంది.

మరోవైపు, ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం గడువు పొడిగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా తాజా షెడ్యూల్‌తో ఓటర్లకు తమ పేర్లను తనిఖీ చేసుకోవడానికి, తప్పులుంటే సరిచేయించుకోవడానికి మరింత సమయం లభించనుంది.

మరిన్ని వార్తలు