హాస్టల్ విద్యార్థులకు చలికాలంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి
- వేడి నీరు, దుప్పట్లు, దోమతెరలతో పాటు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.
- బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం..
- బాల్య వివాహాలను అరికడదాం.
- వలస సుభాష్ చంద్రబోస్
హుజురాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ హాస్టళ్లలో(Government hostels) ఉంటున్న విద్యార్థులకు వేడి నీరు, దుప్పట్లు, దోమతెరలు అందించడంతో పాటు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు(Special health camps) ఏర్పాటు చేయాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నివారణ కోసం బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
బాలల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, విద్య ద్వారానే చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, బాల్య వివాహాలను అరికట్టి ప్రతి చిన్నారికి విద్య అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఆడపిల్లలు సమాజానికి మణిహారాలని, ఆడపిల్లలను పుట్టనిద్దాం.. బతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాలికలు తల్లిదండ్రుల కలలను నిజం చేసేలా ఉన్నత వ్యక్తులుగా ఎదిగి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
చిన్నారులు సెల్ఫోన్లకు అలవాటు పడకుండా క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం బాలికల రక్షణ కోసం షీ టీమ్స్ వంటి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. బాలికలు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా బాలలతో పనులు చేయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని వలస సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు.