దసరాకయినా దక్కేనా..
పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపు
కరీంనగర్, అక్టోబరు 12 (విజయక్రాంతి): నామినేటెడ్ పోస్టుల భర్తీ(Nominated Post Appointments) కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(Congress Party government) కసరత్తు చేస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దసరా నాటికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రకటించడంతో ఆయా పదవులపై ఆశలు పెంచుకున్న వారు మళ్లీ నాయకుల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం, వాయిదా వేయడం జరుగుతుండడంతో కార్యకర్తల్లో కొంత నిరాశ చోటుచేసుకొంది.
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ అధిష్టాన వర్గం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులతో సమావేశం జరిపారు. మొదట టీపీసీసీ అధ్యక్షుడు మార్చి 15లోగా పార్టీ పదవులను, నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఏడు నెలల దాటడంతో ఈ సారి ప్రక్రియ వాయిదా పడకపోవచ్చనే నమ్మకం కార్యకర్తల్లో కలిగింది. రాష్ట్రస్థాయి పదవుల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన హర్కార్ వేణుగోపాల్ రావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, జనక ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరాం చక్రవర్తి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా, జగిత్యాల జిల్లాకు చెందిన జువ్వడి నర్సింగా రావు వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా, కరీంనగర్ జిల్లాకు చెందిన నెరేళ్ల శారద మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా ఇటీవలే నియమితులైనారు. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా రెండేళ్లుగా ఖాళీగా ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రవీందర్ సింగ్ కు ఆ పదవిని కట్టబెట్టారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక రైస్ మిల్లులు గల జిల్లాగా పెద్దపల్లి ఉంది.
ఈ పదవిని పెద్దపల్లి జిల్లాకు చెందిన వారికే ఇవ్వాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. రాష్ట్ర స్థాయి పదవులపై కన్నేసిన నాయకులతో పాటు జిల్లాల స్థాయిలో ఉన్న దేవాలయ కమిటీ పదవులు, సుడా లాంటి కీలక పదవి కోసం ప్రయత్నిస్తున్న నేతలు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో అత్యధిక స్థానాలు సాధించడంతో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల రేసులో ఉన్నారు.
పార్టీ క్షేత్ర స్థాయిలో శ్రేణులు కూడా ఉత్సాహంగా ఉంటేనే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్న అధిష్టానవర్గం నియామకాల ద్వారా నామినేటెడ్ పదవులను ఔత్సాహిక, క్రియాశీల కార్యకర్తలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నది. ఈ పదవుల భర్తీ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నందున గ్రామాల్లో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పని చేసి విజయాన్ని చేకూరుస్తారని నాయకత్వం ఆశిస్తున్నది. అయితే ఈ దసరాకు శుభ వార్త ఉంటుందా నిరాశే మిగులుతుందా చూడాలి.