టీటీడీ ఆలయ నిర్మాణానికి అడుగులు
17న నిర్మాణ పనులు ప్రారంభం
టీటీడీ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి గంగుల
కరీంనగర్, అక్టోబరు 11 (విజయ క్రాంతి): నగరంలోని పద్మనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ(Sri Venkateswara Swamy Temple) నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆలయ నిర్మాణ పనులను ఈ నెల 17న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన టీటీడీ అధికారులతో కలిసి ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఆలయ నమూనాలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మనగర్లో నిర్మించనున్న ఆలయానికి సంబంధించిన నమూనాలు ఆకర్షణీయంగా రూపొందించినట్లు తెలిపారు. తిరుమల ఆలయాన్ని తలపించేలా ప్రధాన ద్వారం ఉండటంతో పాటు గర్భాలయం, అర్థమండపం, ముఖమండపం, గరుడాళ్వార్ తదితర నిర్మాణాలతో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు వివరించారు.
సంప్రదాయబద్ధమైన నిర్మాణ శైలిలో స్వామివారి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం మరింత చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరి శంకర్, నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు గడ్డి ప్రదీప్ యాదవ్, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, మాజీ కొత్తపెళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎంపీపీ పిల్లి, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండియాల మహేష్, నాంపల్లి శ్రీనివాస్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, కరీంనగర్ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్, టిటిడి ఏఈ నాగరాజు, కాంట్రాక్టర్ మధుసూదన్ రాజు, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.