గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి: కూసంపూడి మహేష్
సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections) నేపథ్యంలో సత్తుపల్లి పట్టణంలో బీఆర్ఎస్(BRS) నాయకులు విస్తృతంగా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని పలు విద్యాసంస్థలను సందర్శించిన నాయకులు ఉపాధ్యాయులు, లెక్చరర్లతో సమావేశమై అర్హులైన గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్(Former Municipal Chairman Kusampudi Mahesh), మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి విద్యాసంస్థల్లో పర్యటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ, అర్హతలు తదితర అంశాలపై వివరించారు.
ఈ సందర్భంగా కూసంపూడి మహేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు ఎంతో కీలకమని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీచర్లు, లెక్చరర్లు, ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన వారు, వైద్యులు, ఇంజినీర్లు, ఇతర అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటు నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.