కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నేతల సవాల్
- దమ్ముంటే మేం మంజూరు చేయించిన రోడ్లు వేసి చూపించండి!
- రోడ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- ఆరోపణలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు
నారాయణఖేడ్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులకు రోడ్ల అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి(Former MLA Mahareddy Bhupal Reddy) మంజూరు చేయించిన రోడ్లను నిర్మించి చూపించాలని నాగల్‌గిద్ద మండల బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు.
బుధవారం నారాయణఖేడ్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా మండలంలోని రోడ్ల దుస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం గుంతలను పూడ్చకుండా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హయాంలో ప్రజల అవసరాలను గుర్తించి పలు గ్రామాలకు రోడ్లు మంజూరు చేయించామని, వాటిని పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అధ్వాన రహదారులతో రైతులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తమ పాలనలో నాగల్‌గిద్ద మండలానికి ఎన్ని రోడ్లు మంజూరు చేశారో, ఎన్ని నిర్మించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదని, నాణ్యమైన రోడ్లు, మౌలిక వసతులని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కారముంగి సర్పంచ్ రవికుమార్ పాటిల్, మాజీ సర్పంచ్ కిషన్ నాయక్, వెంకట్ నాయక్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.