వెయ్యి కోట్ల సైబర్ కేసులో కీలక పరిణామం
సత్తుపల్లి, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన వెయ్యి కోట్ల సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో తనిఖీలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతేడాది వీఎం బంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసును అధికారులు మరోసారి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసులో నిందితుడిగా పేర్కొంటున్న సత్తుపల్లికి చెందిన బొప్పన నాగప్రసాద్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక బెంజ్ కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తునకు ఉపయోగపడే కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, వేంసూరు మండలం రాజుగూడెంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో మరో నిందితుడిగా పేర్కొంటున్న మేడా సతీష్ కుమార్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ సోదాలతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.సోదాల్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు, పత్రాల ఆధారంగా అధికారులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.