హైడ్రా పేరుతో టౌన్ ప్లానింగ్ దందా!

10-10-2026 | 05:25am
  1. ఏసీబీకి పట్టుబడిన సూపర్‌వైజర్ 
  2. విచారణలో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): నగరంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ సిబ్బందే (Hyderabad Town Planning supervisor)వాటిని అడ్డుపెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారా?.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను చట్ట ప్రకారం ఎదుర్కోవాల్సింది పోయి, ’హైడ్రా’(HYDRA)  పేరుతో భయపెట్టి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారా? అడిగినంత డబ్బు ఇవ్వకపోతే భవనాన్ని కూల్చివేయిస్తామని హెచ్చరించడంతోపాటు,

ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేయించేందుకు కుట్రలు పన్నుతున్నారా? అంటే బాధితుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల మెహి దీపట్నం సర్కిల్కు చెందిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఏసీబీకి చిక్కడంతో ఈ దందా గుట్టు రట్టయింది. విచారణలో వెల్లడైన వివరాలు, నగరంలోని ఇతర సర్కిళ్లలోనూ జరుగుతున్న అక్రమ వసూళ్లపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది.

రూ.8 లక్షలకు బేరం.. రూ.4 లక్షలు తీసుకుంటూ దొరికిపోయి..

మెహిదీపట్నం సర్కిల్లో ఓ భవన నిర్మాణానికి సంబంధించి, కూల్చివేస్తామంటూ హైడ్రా పేరుతో బెదిరించి రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్లు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తులసిరాం సునీతపై ఆరోపణలు వచ్చాయి. చివరికి రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఈనెల 4న ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన తర్వాత అదనపు అంతస్తులు నిర్మించే బిల్డర్లు, నివాస భవనాలు చేపట్టే యజమానులే లక్ష్యంగా ఈ తరహా దందాలు సాగుతున్నట్లు విచారణలో తేలింది.

‘హైడ్రా’ పేరుతో వసూళ్లకు అస్త్రం!

హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుండటంతో, దాన్నే కొందరు అధికారులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. ‘అడిగినంత ఇవ్వకపోతే హైడ్రాకు ఫిర్యాదు చేసి కూల్చివేయిస్తాం‘ అంటూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. అసలైన ఉల్లంఘనలు ఉంటే నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాల్సిన అధికారులు, దానికి భిన్నంగా బెదిరింపులు, బేరసారాలకు తెగబడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లకు బ్రేకులువసూళ్లకు లొంగని భవన యజమానులను లొంగదీసుకునేందుకు అధికారులు మరో కుట్రకు తెరలేపుతున్నారు. సంబంధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తున్నట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఈ తరహా అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మూడు కార్పొరేషన్లలోనూ తనిఖీలు చేయాలి..

జీహెచ్‌ఎంసీతోపాటు మల్కాజిగిరి, సైబరాబాద్ ము న్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ అక్రమాలు ఒక్క అధికారికే పరిమితం కాలేదని, మరికొందరు కూడా ఇదే దారిలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు, ఇచ్చిన నోటీసులు, సబ్ రిజిస్ట్రార్లకు పంపిన లేఖలను పరిశీలిస్తే మరిన్ని నిజాలు బయటపడతాయని భావిస్తున్నారు.

హైడ్రా తీవ్ర హెచ్చరిక..

తమ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ’హైడ్రా’ స్పష్టం చేసింది. ఎవరైనా హైడ్రా పేరు చెప్పి లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ, స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే, హైడ్రా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్కు కూడా సమాచారం అందించాలని ప్రజలను కోరింది.

మరిన్ని వార్తలు