రోడ్డుపైనే మురుగు.. జనాల బేజారు
- అధికారులకు కనిపిస్తున్నా చర్యలు శూన్యం
- అవుట్‌లెట్ నిర్మాణంలో యజమానుల నిర్లక్ష్యం
జహీరాబాద్, అక్టోబర్ 9 : జహీరాబాద్ మునిసిపాలిటీ(Zaheerabad Municipality) పరిధిలోని రాంనగర్లో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాంనగర్ వెళ్లే ఫ్లై ఓవర్ తర్వాత రోడ్డు మురికినీరు ప్రవహిస్తుండడంతో దుర్గంధం వ్యాపించి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు దాపురించింది. రోడ్డుకు ఇరు ప్రక్కల డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో హోటళ్లు, ఇండ్లలో నుండి వచ్చే మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది.
అయినప్పటికీ మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిఫిన్ సెంటర్ నుండి మురుగునీరు బయటికి వచ్చి రోడ్డుపై ప్రవహిస్తున్నా మున్సిపల్ అధికారులు టిఫిన్ సెంటర్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్కడి ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూడా భారీ భవనం నుండి మురుగునీరు రోడ్డుపైకి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి తాండూర్ వెళ్లే రోడ్డు కావడం వల్ల వాహనాలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తూ ఆ మురుగునీరు నుండి వెళ్లడంతో పక్కన వెళ్లే పాదాచారులకు మురికినీరు పడుతున్నాయని అక్కడి ప్రజలు తెలిపారు.
గతంలో మున్సిపాలిటీ పాలకమండలి లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉండడం వల్ల కొన్ని సంవత్సరాలు పాటు జహీరాబాద్ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగి పాలకమండలి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ మున్సిపల్ చైర్మన్ కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు రోడ్డుపై మురుగునీరు పారకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అవుట్ లెట్ లేకపోవడంతో ఇబ్బందులు :జీ.ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్
మురుగునీరు రోడ్డుపై వస్తున్న మాట వాస్తవమే.. అక్కడి ఇండ్ల నుండి బయటకు అవుట్లెట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవుట్లెట్ అవకాశం ఉంటే వెంటనే పనులు చేపట్టి మురుగునీరు రోడ్డు మీదకు రాకుండా చూస్తాం. రాంనగర్ ప్రాంతానికి చెందిన శానిటేషన్ అధికారి సంధ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద డ్రైనేజీ తోపాటు మురుగు కాలువలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మురుగునీరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు.