కిష్టారం అభివృద్ధికి కొత్త కళ
సత్తుపల్లి, అక్టోబర్ 9 (విజయ క్రాంతి): సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, ప్రజలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను (Smart Ration Cards) సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అందజేశారు. కిష్టారం హైస్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని (Auditorium) ప్రారంభించడంతో పాటు, పాఠశాలలో నూతన తరగతి గదులను ప్రారంభించారు. గ్రామంలో నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. అంబేద్కర్ నగర్, ఎస్సీ కాలనీలో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను (RO Water Plant) ప్రారంభించారు. అలాగే, హనుమాన్ సెంటర్‌లో నూతన మినీ ఫంక్షన్ హాల్‌ను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం కిష్టారం గ్రామ ప్రజలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి తహసీల్దార్, ఎంపీడీవో, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సింగరేణి పీవో, ప్రభుత్వ అధికారులు, కిష్టారం సర్పంచ్ నరకుల్ల రాజేశ్వరి అప్పారావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, నరకుల్ల రవి, కిష్టారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.