ఆపదలో ఆదుకున్న పొంగులేటి!

30-10-2026 | 12:18pm

ఖమ్మం రూరల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ బాధితులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదంలో గాయపడిన సర్పంచ్‌కు పరామర్శ

జాన్ బాత్ తండా సర్పంచ్ భీమా నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ముగ్గురిని కోల్పోయిన కుటుంబానికి అండ

మంగళగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని మోటం మణియమ్మ, మోటం కీర్తన, కావ్య ఇటీవల ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.

బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి.. వారికి గ్రామంలో ఇంటి స్థలం కేటాయించడంతోపాటు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Housing Scheme) మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బాధిత కుటుంబానికి ఊరట కలిగింది.

వృద్ధురాలి మృతికి నివాళులు

గోళ్లపాడు గ్రామానికి చెందిన పరికిపల్లి భద్రమ్మ మృతిచెందడంతో ఆమె నివాసానికి వెళ్లిన మంత్రి పొంగులేటి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వీరెల్లి అప్పారావు, కొప్పుల చంద్రశేఖర్, పలువురు సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు