సీతారామ.. సత్తుపల్లి ట్రంక్‌ పనులకు వేగం

08-10-2026 | 08:42pm

భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి

రైతులకు పరిహారం అందించాలి

నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ

ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు.. పలు మండలాలకు తాగునీటి భరోసా

ఖమ్మం,(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు రైతుల భూములను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం(Sitarama Lift Irrigation Scheme), సత్తుపల్లి ట్రంక్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy)తో భేటీ అయి, ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్‌ పనులు, భూసేకరణ, పైప్‌లైన్‌ నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సత్తుపల్లి ట్రంక్‌ పనులపైనా దృష్టి

సత్తుపల్లి ట్రంక్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని మంత్రి తుమ్మల ప్రస్తావించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, భూములు కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈ పనులు పూర్తయితే సత్తుపల్లి, వేంసూరు మండలాల పరిధిలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు.

రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు

వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని తుమ్మల పేర్కొన్నారు. సాగునీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా పెండింగ్‌ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్‌ ఆయకట్టు పరిధిలోని వైరా, లంకసాగర్‌ ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇటీవల నీటిని విడుదల చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మంత్రి తుమ్మల(Minister Tummala Nageswara Rao) విజ్ఞప్తులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పైప్‌లైన్‌, టన్నెల్‌ తదితర పనుల పురోగతిపై చర్చించారు. రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందేలా పెండింగ్‌ పనులను వేగవంతం చేయడం, భూసేకరణ సమస్యలను పరిష్కరించడం కీలకమని ఈ సందర్భంగా స్పష్టమైంది. సీతారామ ఎత్తిపోతల పథకం సత్తుపల్లి ట్రంక్‌ పనులు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాలకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు తాగునీటి అవసరాలకూ భరోసా లభించనుంది. ఈ నేపథ్యంలో పనుల వేగవంతం, భూసేకరణ పరిష్కారం, రైతులకు పరిహారం చెల్లింపులపై ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు