బేతుపల్లికి జలసిరి..!
- తుమ్మల ప్రత్యేక దృష్టితో నెల రోజుల్లోనే కాలువ పనులు
- సత్తుపల్లి, వేంసూరు మండలాలకు గోదావరి నీళ్లు
- రైతుల్లో హర్షాతిరేకాలు
సత్తుపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): సత్తుపల్లి బేతుపల్లి(Bethupalli) చెరువుకు గోదావరి జలాలు అందించే సీతారామ కాలువకు ఎట్టకేలకు మోక్షం లభించింది.. ఆరు నెలల నుంచి 1.7 కిలోమీటర్ల కాలువ నిర్మాణ పనులకు అవసరమైన 74 ఎకరాల్లో 52 ఎకరాల సంబంధించిన రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులకు బ్రేక్ పడింది. దమ్మపేట మండలం నాగుపల్లి 40.3 వద్ద నిలిచిపోయిన సీతారామ కాలువ పనులు బుధవారం నుంచి శర వేగంగా జరుగుతున్నాయి.
మూడు చోట్ల 9 ప్రోక్లైన్లతో రెండు వైపుల నుంచి పనులను చేపట్టారు. నెల రోజుల్లో కాలువ నిర్మాణ పనులను పూర్తిచేయాలని లక్ష్యంతో వేగవంతంగా చేపడుతున్నారు. రైతులకు పరిహారం విషయంలో పలుమార్లు చర్చించి.. ప్రభుత్వం హామీ ఇచ్చి కోర్టు కేసులను ఉపసంహరణకు ఒప్పించటంతో కాలువ నిర్మాణ పనులకు కదలిక వచ్చింది. రైతులు ఓ మెట్టు దిగివచ్చి ప్రభుత్వానికి సహకారం అందించటం శుభపరిణామంగా చెప్పుకుంటున్నారు.
400 క్యూసెక్కులు.. 24 గంటలే..
బేతుపల్లి చెరువుకు 400 క్యూసెక్కుల గోదావరి జలాలు 42 కిలోమీటర్లు ప్రయాణించి 24 గంటల్లో చేరుకునే విధంగా కాలువల నిర్మాణం జరిగింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి ములకలపల్లి మండలం వీకే రామవరం (పూసుగూడెం), కమలాపురం పంప్ హౌస్ నుంచి తొట్టిపంపు డెలివరీ సిస్టం యాతాలకుంట టన్నెల్, బుగ్గపాడు, నాగుపల్లి వద్ద బేతుపల్లి బ్రాంచ్ కెనాల్ క్రాస్ రెగ్యులేటర్ తూము వద్ద నుంచి శ్రీరాంపురం చెరువు అలుగు పోసుకొని ముసలిబంధం, ఆసన్నగూడెం, మల్లెపూల వాగు మీదుగా గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరుకుంటాయి.
ఇప్పటికే రెగ్యులేటర్, తూము నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. సత్తుపల్లి, వేంసూరు మండలాలకు గోదావరి జలాలతో సత్తుపల్లి, వేంసూరు మండలాలకు జలసిరి రానుంది. బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ ద్వారా వేంసూరు మండలంలోని 46 చెరువులకు గాను 10 వేల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు కుడి, ఎడమ కాలువలతో రామానగరం, తాళ్లమడ, బేతుపల్లి, కిష్టాపురం, నారాయణపురం, తుంబూరు గ్రామాలకు చెందిన అధికారికంగా 4,800 అనధికారికంగా ఆరు వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
ఓవైపు సీతారామ కాలువతో గోదావరి జలాలతో చెరువులు నింపుతూ మరోవైపు బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ ద్వారా సాగునీటిని డిశ్చార్జ్ చేసే విధంగా డిజైన్ చేశారు. మంత్రి తుమ్మల(Minister Tummala Nageswara Rao) నిరంతర కృషితో డిసెంబర్ వరకు మాత్రమే గోదావరి నదిలో నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషితో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రైతులకు మెరుగైన పరిహారం అందించేలా చేయటంతో కాలువ నిర్మాణ పనులకు మోక్షం కలిగింది.
కేవలం 1.7 కిలోమీటర్లు కాలువ నిర్మాణ పనులు భూసేకరణ అడ్డంకులతో ఆగిపోవడం పట్ల ఆదివారం వేంసూరు మండలం కల్లూరుగూడెం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సందర్శన సభలో మంత్రి తుమ్మల అసహనం వ్యక్తం చేసిన విషయం విధితమే. నవంబర్ నెలఖారు కల్లా కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను బేతుపల్లి చెరువుకు తరలించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జలహారతి ఇచ్చేలా పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. గోదావరి జలాలతో భూగర్భ జలాలు పెంపొందించడమే కాకుండా ఆయకట్టు స్థిరీకరమవుతుంది.