స్టైపెండ్ పెంపు కోసం ఎఫ్‌ఎంజీ ఇంటర్న్ వైద్యుల ఆందోళన
పని ఒకటే.. వేతనం సమానంగా ఇవ్వాలి: ఇంటర్న్ వైద్యుల డిమాండ్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విదేశీ వైద్య విద్య పట్టభద్రులైన(Graduates of foreign medical education) ఇంటర్న్ వైద్యులు స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.ఆసుపత్రుల్లోని ఓపీడీలు, వార్డులు, అత్యవసర విభాగాల్లో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న తమకు రోజుకు కేవలం రూ.166 మాత్రమే స్టైపెండ్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ వైద్య విద్య పట్టభద్రులైన (Indian Medical Graduates) ఇంటర్న్‌లకు నెలకు సుమారు రూ.29,792 స్టైపెండ్ అందుతుండగా, తమకు మాత్రం అతి తక్కువ మొత్తాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్న ఇంటర్న్ వైద్యులందరికీ సమాన స్టైపెండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఎంజీ ఇంటర్న్‌ల స్టైపెండ్‌ను ఐఎంజీలతో సమానంగా పెంచాలని, తమ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. తమ శాంతియుత నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాడం జరుగుతుందని తెలిపారు.