కాగితాల్లో లెక్కలు.. క్షేత్రస్థాయిలో కనిపించని మొక్కలు!

13-10-2026 | 05:05am

కుకుడ గ్రామ నర్సరీలో మొక్కల పెంపకంపై నిర్లక్ష్యమా?

ట్రాక్టర్‌తో మొక్కలు తొలగించారంటూ స్థానికుల ఆరోపణలు.. విచారణకు డిమాండ్

బెజ్జూర్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బెజ్జూర్ మండలం కుకుడ గ్రామపంచాయతీ నర్సరీలో(Kukuda Gram Panchayat Nursery) మొక్కల పెంపకం, సంరక్షణపై నిర్లక్ష్యం కనిపిస్తోందని, నర్సరీలో మిగిలిన మొక్కలను ట్రాక్టర్ ద్వారా తొలగించారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలను పడేయలేదని, కవర్లు మాత్రమే తొలగించినట్లు పంచాయతీ కార్యదర్శి వివరణ ఇచ్చారు.

ప్రశ్నార్థకంగా మారిన మొక్కల పెంపకం...!

గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకానికి నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, వాటి సంరక్షణపై పర్యవేక్షణ కొరవడిందని స్థానికులు అంటున్నారు. నర్సరీలో మొక్కలకు సకాలంలో నీరు అందించకపోవడంతో కొన్ని ఎండిపోతున్నాయని, మరికొన్ని పశువుల బారిన పడుతున్నాయని చెబుతున్నారు. మొక్కలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయకపోవడం, నీటి ట్యాంకర్ అందుబాటులో ఉన్నా సక్రమంగా నీరు పోయకపోవడం వల్ల నాటిన మొక్కల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటున్నారు.

వర్షాకాలంలో రహదారులకు ఇరువైపులా, చెరువుగట్లపై, పొలాల గట్ల వెంట మొక్కలు నాటి సంరక్షించాల్సి ఉండగా, ఆశించిన స్థాయిలో కార్యక్రమం అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సరీలో మిగిలిన మొక్కలను కూడా సద్వినియోగం చేయకుండా వృథా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వనమహోత్సవం లక్ష్యం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించి బతికించడం కూడా కావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

పారిశుధ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు..

కుకుడ గ్రామంలో చేతిపంపుల సమీపంలో మురుగునీటి కాలువలు లేకపోవడంతో నీరు రహదారులపైకి చేరి బురదమయంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరుగుతోందని, సమస్యలను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదని ఆరోపిస్తున్నారు.

సమన్వయ లోపంపై విమర్శలు...

గ్రామ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో పనిచేయాల్సి ఉండగా, ఇక్కడ పరస్పర సమన్వయం కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా గ్రామంలో పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.

విచారణ జరిపించాలని డిమాండ్...

నర్సరీ నిర్వహణ, మొక్కల సంరక్షణ, మొక్కలు తొలగించారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ నిధులు వృథా కాకుండా చూడటంతో పాటు, నాటిన మొక్కల మనుగడపై తనిఖీలు నిర్వహించి బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలను పరిష్కరించి, పంచాయతీ పాలనలో సమన్వయం పెంచాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు