కుమ్రం భీం పోరాటం చిరస్మరణీయం
- గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు
- మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క
ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం పోరాడిన వీరుడు కుమ్రం భీం(Kumram Bheem) త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ధనసరి సీతక్క(Dhanasari Seethakka) అన్నారు. కుమ్రం భీం 86వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా(Kumram Bheem Asifabad District) కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
గిరిజన గ్రామాల్లో రహదారులు, వంతెనలు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఐటీడీఏలకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, జల్, జంగల్, జమీన్ కోసం కుమ్రం భీం చేసిన పోరాటం ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు.
ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లు, తాగునీరు, విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలో సుమారు 8 వేల ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు లభించిందని, పర్యాటక అభివృద్ధికి రూ.5 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ.180 కోట్లతో చర్యలు చేపడుతున్నామని వివరించారు.
ఆదిలాబాద్ ఎంపీ జి. నగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ హరీత, ఎస్పీ నికిత పంత్ మాట్లాడారు. ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరంద్ గోండి భాషలో ప్రసంగించి గిరిజనులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేశారు.
ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. గుస్సాడీ, చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో భీం మనుమడు సోనే రావు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ జోయల్, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు.