ఎండిపోతున్న పంటలు

23-09-2026 | 05:30am
  1. ఆగమవుతున్న రైతన్న బతుకులు.. 
  2. వాన కోసం అన్నదాత ఎదురుచూపులు
  3. కళ్లముందే ఎండుతున్న పంటలు

కౌటాల, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): వాన కోసం ఎదురుచూస్తున్న రైతన్నకు(Farmer) నిరాశే మిగులుతోంది. నైరుతి రుతుపవనాల సీజన్ చివరి దశకు చేరుకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి(Crops are withering.). పచ్చగా కనిపించాల్సిన చేలు నెర్రలు బారుతుండటంతో రైతుల ఆందోళన పెరుగుతోంది. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కళ్లముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

వాన వస్తేనే పంట.. లేదంటే నష్టం

కౌటాల ప్రాంతంలో వ్యవసాయం(Agriculture) ప్రధానంగా వర్షాధారంపైనే కొనసాగుతోంది. పంట ఎదుగుతున్న సమయంలో వర్షం ముఖం చాటేయడంతో వరి, మిర్చి, పత్తి తదితర పంటలకు నీటి కొరత ఏర్పడుతోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అప్పులు పెరుగుతున్నాయ్.. ఆశలు తగ్గుతున్నాయ్...

పంట కోసం అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు వర్షాభావం మరింత భారంగా మారుతోంది. పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడితే పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంటోంది. పొలంలో పంట లేక.. చేతిలో డబ్బు లేక.. చేసిన అప్పులు మాత్రం మిగిలే పరిస్థితి రైతులను కలవరపెడుతోంది.

శాశ్వత సాగునీటి వసతి అవసరం..

వర్షాలపై ఆధారపడకుండా రైతులకు శాశ్వత సాగునీటి వనరులు(Irrigation water resources) కల్పించాలని రైతులు కోరుతున్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టి పంటలకు సాగునీటి భరోసా కల్పిస్తేనే వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు. వాన పడితే పంట.. వాన పడకపోతే నష్టం అన్న పరిస్థితి నుంచి రైతులను బయటపడేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

సాగునీటి వసతి కల్పించాలి 

మా పొలంలో 3 ఎకరాల్లో వరి, 6 ఎకరాల్లో మిర్చి, 5 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. వర్షాలు లేక నీటి కొరత ఏర్పడింది. పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టాం.. ఇప్పుడు నీళ్లు లేక పంటలను కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్పందించి సాగునీటి వసతి కల్పించి పంటలను కాపాడాలి.

- ఎల్ములే దత్తు పటేల్, రైతు

మరిన్ని వార్తలు