కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మిషన్ భగీరథ (Mission Bhagiratha)కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలతో పాటు బోనస్, పెట్రోల్ అలవెన్స్, సాలరీ స్లిప్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ తదితర సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ పీఎం సునీల్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. పలుమార్లు అధికారులను కలిసి సమస్యలు విన్నవించినా పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని ఏజెన్సీలు, ముఖ్యంగా ఎవరెస్ట్ ఏజెన్సీ, గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ జిల్లా అధ్యక్షుడు బాలేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంషద్, ప్రధాన కార్యదర్శి షకీర్, నాయకులు శ్రీకాంత్, బుడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.