కంబాలపల్లి చిరుతల భజన

29-11-2026 | 05:10am

ఆధునిక సాంకేతికత పరుగులు(Technology Races Ahead) పెడుతున్న ప్రస్తుత కాలంలో పల్లెల్లో ఒకప్పుడు కళకళలాడిన అనేక జానపద కళారూపాలు(Folk Art Forms) కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సంప్రదాయ కళలకు ఆదరణ కరువై, కళాకారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన కొందరు మాత్రం తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా అందిన ప్రాచీన ‘చిరుతల భజన’ కళను ఇప్పటికీ సజీవంగా కొనసాగిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

తరతరాలుగా వస్తున్న ఈ కళారూపాన్ని కేవలం వినోదంగా కాకుండా భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకగా భావిస్తూ భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. చిరుతల భజన అనేది కేవలం పాటలు పాడుతూ చేసే భజన మాత్రమే కాదు.. లయబద్ధమైన అడుగులు, చేతుల్లో చిరుతలు (తాళాలు) మోగిస్తూ చేసే సమూహ కళా ప్రదర్శన. భజన పాటలకు అనుగుణంగా కళాకారులు సమన్వయంతో అడుగులు వేస్తూ, చిరుతల చప్పుళ్లతో ప్రత్యేకమైన సంగీత నాదాన్ని పలికిస్తారు.

భక్తి గీతాలు, పౌరాణిక గాథలు, సంప్రదాయ గేయాల ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. ప్రదర్శనలో కళాకారుల మధ్య ఉండే సమన్వయం, క్రమశిక్షణ, లయబద్ధమైన కదలికలు ఈ కళకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు, దేవాలయ వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చిరుతల భజనకు విశేష ప్రాధాన్యత ఉండేది. గ్రామీణ జీవనశైలిలో అంతర్భాగంగా ఉన్న ఈ కళారూపం నేటి తరానికి అంతగా పరిచయం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. టీవీలు, సెల్‌ఫోన్లు, ఆధునిక వినోద సాధనాల ప్రభావంతో సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గుతున్నప్పటికీ కంబాలపల్లి వాసులు మాత్రం తమ పూర్వీకుల కళా వారసత్వాన్ని వదులుకోకుండా కొనసాగించడం అభినందనీయం. 

అభయాంజనేయ భజన బృందం 

గ్రామానికి చెందిన సాంస్కృతిక సారధి బృందం సభ్యుడు కంబాలపల్లి సత్యనారాయణ సారథ్యంలో శ్రీ అభయాంజనేయ భజన బృందం ఏర్పాటు చేసి, పిట్టల వెంకన్న (మాస్టర్), కళ్లెం జనార్ధన్ (మాస్టర్) తుప్పతూరి మల్లయ్య (మాస్టర్) ఆధ్వర్యంలో దాదాపు 30 మంది చిరుతల భజన కళను నేర్చుకోవడం, సాధన చేయడం, ప్రదర్శించడం ద్వారా తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారు. అయితే ఇలాంటి అరుదైన జానపద కళలకు ప్రభుత్వ, సాంస్కృతిక సంస్థల ప్రోత్సాహం ఎంతో అవసరం.

గ్రామీణ కళాకారులకు తగిన గుర్తింపు, ఆర్థిక సహకారం, ప్రదర్శనలకు అవకాశాలు కల్పించడంతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో ఇటువంటి సంప్రదాయ కళారూపాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. కంబాలపల్లి వాసులు కొనసాగిస్తున్న చిరుతల భజన కేవలం ఒక గ్రామ కళా ప్రదర్శన కాదు.. తరతరాల సంస్కృతిని మోసుకొస్తున్న సజీవ వారసత్వం. కాలం మారినా కళకు కాలదోషం పట్టదని, ఆదరించే మనసుంటే ప్రాచీన సంప్రదాయాలు ఎన్నటికీ అంతరించిపోవని కంబాలపల్లి కళాకారులు తమ ప్రదర్శనలతో నిరూపిస్తున్నారు.

బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి


మరిన్ని వార్తలు