ఆ తరం తరలుతోంది!
ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం తరలుతోంది. తరం అంటే కేవలం మనుషులు కాదు, ఒక జీవన విధానం, ఒక సంస్కృతి, ఒక విలువల పుస్తకం. వారు వెళ్లిపోతుంటే సర్వం కోల్పోతున్న భావన కలుగుతోంది.
జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట జిల్లా (విజయక్రాంతి): అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించి, తమ కంచంలో పక్కవాడికి వాటా పెట్టిన తరం. ఇరుకు గదులు, చిన్న ఇళ్లల్లోనే పెద్ద మనసుతో, గొప్ప ప్రేమతో బతికిన తరం. బాధ్యత అంటే ఏమిటో తెలిసిన తరం. నేను అనే స్వార్థం లేకుండా మనం అనే మమకారంతో జీవించిన తరం. వారికి పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు. కానీ జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన పండితులు వారు. చేతికి గడియారం లేకపోయినా, సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకున్నవారు.
గూగుల్, ఇంటర్నెట్ లేకపోయినా అపారమైన లోక జ్ఞానాన్ని సంపాదించినవారు. కాలిక్యులేటర్ లేకున్నా, కిరాణా లెక్కల నుండి భూమి లెక్కల వరకు నోటితోనే తేల్చిన మేధావులు. మొబైల్ ఫోన్లు లేకపోయినా, రోజంతా స్నేహ సంభాషణలకు లోటు లేకుండా బతికారు. టీవీలు, ఓటీటీలు లేకపోయినా, వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, హరికథలతో వినోదంగా కాలం గడిపారు. జీపీఎస్‌లు లేకపోయినా, దారి తప్పకుండా గమ్యాన్ని చేరగలిగిన దార్శనికులు.
ఏసీలు, కూలర్లు లేకున్నా ఆరుబయట మంచం వేసుకుని, చల్లని గాలిలో, నక్షత్రాలను చూస్తూ హాయిగా నిద్రించిన తరం. మినరల్ వాటర్ పేరు కూడా తెలియకుండా, చెరువు, బావి నీళ్లు తాగి నూరేళ్లు ఆరోగ్యంగా బతికిన తరం. పిజ్జాలు, బర్గర్లు తెలియకపోయినా, పీచు మిఠాయిలు, పేలాలు, అటుకులు తిని తృప్తిగా జీవించిన తరం. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై చేరి, ఊరి కబుర్లు, వ్యవసాయ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం.
క్రమశిక్షణకు మారుపేరు
కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా నడిచిన తరం. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ నాలుగు దెబ్బలు వేస్తే, ఇంట్లో తల్లిదండ్రులు మరో పది దెబ్బలు వేసి, గురువును గౌరవించిన తరం. ఇంటి ముంగిటిని రంగురంగుల ముగ్గులతో అలంకరించిన తరం. పనిమనుషులు, యోగా, జిమ్‌లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన శ్రమజీవులు. వారు బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. ఆస్తులకన్నా ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం.
ఉమ్మడి కుటుంబాలుగా, ఒకే గూటిలో, కలివిడిగా ఆనందంగా జీవించిన తరం. భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్లగలిగిన సహనశీలురు. వ్యాపారంలో కల్తీకి చోటివ్వని నిజాయితీపరులు. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా, హార్ట్ ఎటాక్, క్యాన్సర్, బీపీ, షుగర్లను దరిచేరనీయని తరం. లాంతర్ల వెలుగులోనే జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. ఆడంబరాలకు దూరంగా, నిరాడంబరంగా బతికిన తరం. పోస్ట్ కార్డులపై నాలుగు ముక్కలతోనే ప్రేమను, బాధను పంచుకున్న తరం.
నేడు అంతా తారుమారు
అలాంటి అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. వారితో పాటే ప్రేమ, నమ్మకం, నీతి, నిజాయితీ, సహనం, ఓర్పు లాంటి విలువలు కూడా కనుమరుగవుతున్నాయి. వెళ్లిపోతున్న ఆ తరం నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే, వారి అనుభవాలను, జ్ఞానాన్ని భావితరాలకు అందించకపోతే భవిష్యత్తు అంధకారమే అవుతుంది. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, మానవత్వం లేకపోతే ఆ అభివృద్ధికి అర్థం లేదు.
వూర సంపత్ కుమార్,