వామ్మో.. లీచెట్!

29-11-2026 | 05:15am

బతుకులను బుగ్గిచేస్తున్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్

  1. చెత్తతో వస్తున్న లీచెట్‌తో మరింత కాలుష్యం
  2. నల్లగా మారుతున్న చెరువులు, కుంటలు
  3. సరిగ్గా ట్రీట్‌మెంట్ చేయని రాంకీ సంస్థ

హైదరాబాద్, నవంబర్ 2౮ (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Jawaharnagar Dumping Yard) వల్ల జనం నరకం అనుభవిస్తున్నారు. ఆ చెత్త నుంచి కారే నీరు (లీచెట్)తో అక్కడ ఓ పెద్ద చెరువే ఏర్పడింది. దాని దుర్గంధానికి స్థానికులు అల్లాడిపోతున్నారు.  హైదరాబాద్ మహా నగరం (ఓఆర్‌ఆర్ లోపల)  నుంచి ప్రతిరోజు సుమారు 10 వేల టన్నుల వరకు చెత్త ఆ డంపింగ్ యార్డ్‌కు వస్తుందని అంచనా. ఇలా తరలి వచ్చిన చెత్తతోపాటు లీచెట్ కూడా ఇక్కడికి చేరుతున్నది. ఈ చెత్తను గుట్టలుగా పోయడం వల్ల..

ఇందులో నుంచి లక్షల లీటర్ల లీచెట్ బయటకు వస్తూ పక్కనే ఓ పెద్ద చెరువులా తయారైంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో లీచెట్‌ను ట్రీట్‌మెంట్ చేయడానికి 2,000 కేఎల్‌డీ సామర్థ్యంతో ఏర్పాటుచేసిన ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రతిరోజూ లక్షలాది లీటర్ల లీచెట్ నీరు వస్తుండగా.. కేవలం 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో పనిచేసే ప్లాంట్ ఉంది. పైపెచ్చు.. ఆ ప్లాంట్ కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని స్థానికులు అంటున్నారు. 

రోగాలపాలు

లీచెట్ భూగర్భంలోకి వెళ్లడంతో.. చుట్టుపక్కల ఉన్న బోర్లు ఈ లీచెట్‌తో నిండిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్ల నుంచి దుర్గంధ, కలుషిత నీరు వస్తున్నదని అంటున్నారు. వాటిని తాగాలంటేనే భయపడుతున్నారు. లీచెట్‌లో ఉండే లెడ్, ఆర్సెనిక్, మెర్క్యురీ, క్రోమియం లాంటి హెవీ మెటల్స్ విషంగా మారి.. లివర్, కిడ్నీ, నరాలపై తీవ్ర ప్రభావం చూపడంతో క్యాన్సర్ వంటి అనేక వ్యాధులను తెచ్చిపెడుతున్నది. చర్మవ్యాధులు, మచ్చలు, అలర్జీలు, అమ్మోనియా వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. 

రాంకీ నిర్లక్ష్యం.. సర్కార్ మౌనం

నిజానికి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ చాలా ఎత్తయిన ప్రదేశంలో ఉంది. ఎక్కడో దిగువన గ్రానైట్ రాయి ఉంది. ప్రతిరోజూ చెత్తతోపాటు వచ్చే లీచెట్ దిగువకు ప్రవహిస్తూ.. భూగర్భజలాల్లో కలుస్తున్నది. దీనితో చుట్టుపక్కల ఉన్న పదుల సంఖ్యలోని గ్రామాల్లోని బోర్లు, నీటిప్రవాహాలు, చెరువులు, కుంటల్లోని నీరంతా కలుషితం అవుతున్నది. స్థానిక చెరువులు, కుంటలు, ప్రవాహాల్లో చేపలు, ఇతర జలచరాలు బతకడం లేదు. రోజూ వచ్చే చెత్తతోపాటు లీచెట్‌ను కూడా మున్సిపల్‌ల్ సాలిడ్ వేస్ట్ (ఎంఎస్‌డబ్ల్యూ) నిర్వహణ చేస్తున్న రాంకీ సంస్థ ట్రీట్‌మెంట్ చేయాలి.

అయితే 2,000 కేఎల్‌డీ సామర్థ్యంతో నీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పినా.. అది పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని స్థానికులు అంటున్నారు. పైగా అక్కడికి వస్తున్న లీచెట్ లక్షల లీటర్ల స్థాయిలో ఉండగా.. ప్లాంట్ సామర్థ్యం అందుకు సరిపోవడంలేదని చెప్తున్నారు. గడిచిన దశాబ్దకాలంగా జవహర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్న చెత్త.. మరీ ముఖ్యంగా లీచెట్ వల్ల గాలి, నీరు, భూమి మొత్తం కాలుష్యంతో నిండిపోయింది.

హైదరాబాద్ మహానగరం చుట్టూరా పలు ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటుచేస్తే.. ఒక్కచోటే కాలుష్యం కేంద్రీకృతం కాదని, అనేక చోట్ల చెత్తను, లీచెట్‌ను ట్రీట్‌మెంట్ చేసే వ్యవస్థలు ఏర్పాటు చేయవచ్చని స్థానికులు అంటున్నారు. అయితే ప్రతి టన్ను చెత్తకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం.. కాలుష్యాన్ని అరికట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు.

జీహెచ్‌ఎంసీతోపాటు కొద్ది కాలం క్రితం ఏర్పడిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కూడా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల జరిగిన కాలుష్య నష్టాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కనీసం చెత్తను ప్రాసెస్, ట్రీట్‌మెంట్ చేసే సంస్థ రాంకీ పూర్తిస్థాయిలో పనిచేయకపోయినా.. కార్పొరేషన్లు, ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

చెరువును కమ్మేసిన లీచెట్

ఈ ఫొటోలో కనిపిస్తున్నది దమ్మాయిగూడ చిన్న చెరువు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు కేవలం 1.5 కి.మీ.దూరంలోఉండే ఈ చెరువులోని నీరు మొత్తం నల్లగా మారింది. ఇందుకు ప్రధాన కారణం.. డంపింగ్ యార్డ్‌లోని చెత్త ప్రభావమే. ముఖ్యంగా ఎత్తయిన ప్రదేశంలో ఉన్న డంపింగ్ యార్డ్ నుంచి దిగువకు వచ్చే లీచెట్ భూమిలోకి ఇంకి.. ఈ చెరువులో కలుస్తున్నది. ఫలితంగా చెరువు ఇలా తయారైంది. ఈ చెరువు కింద కొంతమేర వ్యవసాయం సాగుచేస్తున్నా.. ఈ పంటలు కూడా విషతుల్యంగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. 

చెరువులా మారిన లీచెట్!

ఈ ఫొటో చూడండి.. పెద్ద చెరువులా కనిపిస్తున్నది కదా! ఈ చెరువు కింద వ్యవసాయం సాగుతుందని, గ్రామాల్లోని ప్రజలకు సాగునీటి అవసరాలు తీర్చుతుందని అనుకుంటే మీరు లీచెట్‌లో కాలేసినట్టే. అదేంటి లీచెట్ అనుకుంటున్నారా.. అదేనండి .. ప్రతిరోజూ మన ఇండ్లల్లో తయారయ్యే చెత్తనుంచి కారే నీరు లాంటి ఒకింత చిక్కగా ఉండే ద్రావణం. తీవ్ర దుర్గంధంతో ఉండే ఇలాంటి లీచెట్‌తో ఏర్పడిందే ఈ చెరువు. ఇదెక్కడ అనుకుంటున్నారా..?! హైదరాబాద్ మహా నగరం నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించే జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో లీచెట్ నీటితో ఏర్పడిన పెద్ద చెరువు ఇది. 

పిల్లను కూడా ఇస్తలేరు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న కాలనీలు, జనావాసాలు, గ్రామాల్లోని బోర్లు, బావులన్నీ కాలుష్యంతో నిండి నీళ్లు నల్ల రంగులోకి మారాయి. వీటిని ఉపయోగిస్తే.. చర్మంపై దద్దుర్లు, ఇతర రోగాలు వస్తున్నాయి. ఇక వీటిని తాగితే అంతే..! గుర్తు తెలియని రోగాలతో చనిపోవడం ఖాయం. అనేక రకాల క్యాన్సర్ల బారిన పడి ప్రజలు చనిపోతున్నారు. ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్లు ఇక్కడి లక్షలాది ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. కనీసం ఇక్కడి యువకులకు పెండ్లి చేసుకోవడానికి అమ్మాయిలను కూడా ఇవ్వడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

 అల్లూరి సావిత్రి, జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ సభ్యురాలు

30 కి.మీ. వరకు కాలుష్యం 

ఇప్పుడు ఉన్న డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల సుమారు 30 కి.మీ. దూరం వరకు గాలి, నీరు, నేల కాలుష్యంతో నిండిపోయింది. చెరువులు, వాగులు, వంకలు, బోర్లు, బావులన్నీ కాలుష్యం నీటితో నల్లగా మారాయి. వాటిని కనీసం వ్యవసాయానికి కూడా ఉపయోగించలేని పరిస్థితి. సుమారు 40 లక్షల మంది ప్రజలు కాలుష్యంతో బాధపడుతున్నా.. ప్రభుత్వం, కార్పొరేషన్లు పట్టించుకోవడం లేదు. చెత్తను రాంకీ సంస్థ సరిగా ట్రీట్‌మెంట్ చేయడం లేదు. 

 కొన్నె వేణు, కో కన్వీనర్, జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ


మరిన్ని వార్తలు