డీలిమిటేషన్‌తో బీసీలకు ఒరిగేది లేదు

29-11-2026 | 05:15am
  1. ముందుగా ఓబీసీ కులగణన చేపట్టాలి
  2. పూలేకు భారతరత్న ఇవ్వకుండా బీజేపీ అవమానిస్తుంది
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్  

హైదరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): రాజకీయ నిరుద్యోగులకు దొడ్డిదారిన చట్టసభలకు పంపించడానికి మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియను(Delimitation process) కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువస్తుందని, డీలిమిటేషన్ వలన బీసీలకు ఒరిగేది ఏమీ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సామాజిక సంఘసంస్కర్త, బడుగుల వెలుగు రేఖ మహాత్మ జ్యోతిబాపూలే 136వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న అవినీతిని, నిరుద్యోగ సమస్యని, అణగారిన వర్గాల అణచివేతని, సామాజిక దోపిడిని నిర్మూలించి సమ సమాజానికి, సమానత్వానికి దారులు వేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీల హక్కులను కాలరాయడానికి నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దొంగ నాటకాలు అడుగుతుందన్నారు.  మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం చట్టసభలలో కనీస ప్రాతినిధ్యం లేని ఓబీసీ మహిళలకు సబ్ కోట ఎందుకు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు.

బీసీలకు ప్రాతినిధ్యం లేని ప్రయోజనం లేని డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లును ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేరుకే నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని, ఆయన 13 ఏళ్ల పాలనలో బీసీలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. జ్యోతిబాపూలే జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించే వరకు, డీలిమిటేషన్ ప్రతిపాదనను విరమించుకునే వరకు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించే వరకు కేంద్ర ప్రభుత్వంపైన బీసీలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు