8 నెలల్లో రూ.487 కోట్ల.. తెల్ల కోట్ల వెనుక చీకటి నిజాలు

29-11-2026 | 07:56am

43 సెంటర్లు.. నెలకో 100 మంది మహిళలు: కళ్లు బైర్లు కమ్మే చీకటి వ్యాపారం!

హైదరాబాద్: అమాయకపు పేద మహిళల అవసరాలే పెట్టుబడిగా, అత్యంత ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రుల ముసుగులో సాగుతున్న ఓ భయంకరమైన చీకటి దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ 'అండాల అక్రమ సేకరణ' (Illegal Egg Harvesting) మాఫియా లెక్కలు చూసి పోలీసులే విస్తుపోతున్నారు. కేవలం 8 నెలల కాలంలోనే ఈ ముఠా ఏకంగా రూ.487.82 కోట్ల లావాదేవీలు జరిపిందంటే ఈ దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

అసలు ఈ చీకటి నెట్‌వర్క్ ఎలా పనిచేసేది?

మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మొత్తం వ్యవహారానికి 'సద్గురు హెల్త్‌కేర్ సర్వీస్ సెంటర్' ప్రధాన కేంద్రంగా పనిచేసింది. పేదరికంలో ఉన్న మహిళలను గుర్తించి, వారిని మభ్యపెట్టి తీసుకురావడంలో డాక్టర్ దుర్గారావు కీలక పాత్ర పోషించాడు. అలా తీసుకువచ్చిన మహిళల నుంచి అక్రమంగా అండాలను సేకరించి, వాటిని దేశవ్యాప్తంగా ఉన్న 43 ఫర్టిలిటీ సెంటర్లకు సరఫరా చేసేవారు. ఈ సప్లై చైన్ వెనుక సద్గురు హెల్త్‌కేర్ హైదరాబాద్ సీవోవో ప్రతీక్ అనిల్ గంగ్లానీ, ఒయాసిస్ ఫర్టిలిటీ మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజశ్రీ దేవ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

లక్షల జీతాలు.. వందల కోట్ల టర్నోవర్

ఈ అక్రమ దందాలో భాగస్వాములైన ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు భారీ జీతాలు ముట్టజెప్పేవారు. దేశవ్యాప్తంగా ఉన్న 43 సెంటర్ల ద్వారా ప్రతి నెలా సుమారు 100 మంది మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అండాలను సేకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి నవంబరు 26 వరకు కేవలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాల ద్వారానే రూ.487.82 కోట్ల నగదు చేతులు మారిందంటే, దీని వెనుక ఇంకెంత పెద్ద తిమింగలాలు ఉన్నాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బేగంపేట హాస్టల్ తనిఖీలతో మొదలై..

అక్టోబరు 30న బేగంపేటలోని ఒక మహిళా వసతి గృహంపై పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీలతో ఈ చీకటి బాగోతం బయటపడింది. అప్పటి నుంచి తీగ లాగితే డొంక కదిలినట్లు, తాజాగా మరో ఇద్దరి అరెస్టుతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం ప్రధాన నిందితులైన ఐదుగురిని పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. ఈ కేసు తీవ్రత, అంతర్రాష్ట్ర లింకుల దృష్ట్యా దీనిని సీసీఎస్‌ (CCS)కు బదిలీ చేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు