కొడంగల్‌పై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌

07-11-2026 | 08:47am

కొడంగల్‌లో సీఎం రేవంత్‌ పర్యటన.. రూ.9,053 కోట్లతో అభివృద్ధి పనులు!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. నవంబర్‌ 7, 8, 9 తేదీల్లో సాగే ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతులు, పారిశ్రామికవేత్తలు, మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా Mega Farmers Fair, Industrial Expo ప్రారంభించడంతో పాటు దాదాపు రూ.9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోతో మొదటి రోజు

పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ హబ్‌ ప్రాంగణానికి సీఎం చేరుకోనున్నారు. అక్కడ మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ప్రారంభించి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన Exhibition Stallsను సందర్శిస్తారు. ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహించి ఆధునిక సాగు పద్ధతులు, కొత్త వ్యవసాయ సాంకేతికత, రైతులకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలపై చర్చించనున్నారు.

రూ.9,053 కోట్లతో 13 కీలక ప్రాజెక్టులు

ఈ మూడు రోజుల పర్యటనలో మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు చేయనున్నారు. ఇందులో అత్యంత కీలకమైనది రూ.5,060 కోట్లతో నిర్మించనున్న Radial Road-2. కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. అలాగే రూ.2,100 కోట్లతో మహబూబ్‌నగర్‌-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు, రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి BT రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. విద్య, ఉపాధి రంగాలకూ ఈ పర్యటనలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల, రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టనున్నారు. కొడంగల్‌, కోస్గి, మద్దూరులో రూ.41.83 కోట్లతో ఆధునిక బస్‌స్టాండ్లు, మద్దూరులో రూ.20 కోట్లతో NAC Skill Development Centre ఏర్పాటు చేయనున్నారు. హకీంపేట ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రూ.81 కోట్లతో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.

రెండో రోజు భవనాల ప్రారంభోత్సవాలు

ఆదివారం స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో పూర్తయిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ కార్యాలయాలు, సమీకృత మండల కార్యాలయ భవనాలు ఇందులో ఉన్నాయి. కోస్గిలో నిర్మించిన సైన్స్‌ మ్యూజియాన్ని కూడా ప్రారంభించనున్నారు. మొత్తం రూ.46.08 కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకున్న ప్రభుత్వ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

9న భారీ రైతు బహిరంగ సభ

పర్యటన చివరి రోజైన నవంబర్‌ 9న హకీంపేటలో భారీ రైతు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల నుంచి రైతులు తరలిరానున్నారు. మూడు రోజుల పాటు వరుస కార్యక్రమాలతో సాగనున్న సీఎం పర్యటనతో కొడంగల్‌ ప్రాంతంలో అభివృద్ధి పనులు, పారిశ్రామిక పెట్టుబడులు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి నెలకొంది.

మరిన్ని వార్తలు