ఛట్‌పూజ తర్వాత కరీంనగర్‌కు వస్తా
- అక్కడ మహా పాదయాత్రలో పాల్గొంటా!
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో(BJP National President Nitin Nabin in Delhi) భేటీ అయ్యారు. బీజేపీ మహాపాదయాత్ర, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై బండి సంజయ్‌తో నితిన్ నబీన్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్, ఇండీ కూటమి విష ప్రచారం చేస్తున్నాయని, తిప్పికొడుతూ ‘సర్’ విషయంలో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కరీంనగర్‌లో చేపట్టనున్న ‘మహా పాదయాత్ర’కు త్వరలో తానే స్వయంగా వస్తానని బండి సంజయ్‌కు నితిన్ నబీన్ తెలిపారు.
వాస్తవానికి ఈ నెల 5న కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోయానన్నారు. ‘ఛట్ పూజ’ అనంతరం తప్పకుండా కరీంనగర్ వచ్చి మహా పాదయాత్రలో పాల్గొంటానని బండి సంజయ్‌తో నితిన్ నబీన్ తెలిపారు. ఈసారి వచ్చినప్పుడు కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల జోష్‌ను చూస్తానని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో నిర్వహించిన పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్‌లో చేపట్టిన పాదయాత్రలో సునీల్ బన్సల్, ఇతర నేతలు పాల్గొన్నారు.