ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు!
విద్యుత్ కోతలు.. సాగునీటి కష్టాలతో అన్నదాతల ఆవేదన
- ఆకాశం వైపు ఆశగా రైతు చూపులు.. పొలాల్లో వాడిపోతున్న పచ్చదనం
రామారెడ్డి, అక్టోబర్ 9 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగునీటి కొరత(Irrigation water shortage), విద్యుత్ సరఫరాలో ఇబ్బందులతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామారెడ్డి మండలం గోకుల్ తండాకు చెందిన మహిపాల్ అనే రైతుకు మూడు ఎకరాల్లో సాగు చేసిన పంట ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అలాగే మండలంలోని గొల్లపల్లిలోనూ పలువురు రైతుల పంటలు ఎండిపోతున్నాయని తెలుస్తోంది.
పెట్టుబడులు పెట్టి పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు సాగునీటి ఇబ్బందులు భారంగా మారాయి.పంటలు చేతికొచ్చే సమయంలో ఎదురవుతున్న సమస్యలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఎల్నినో ప్రభావంపై ఆందోళన
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఏర్పడే ఎల్నినో ప్రభావం రుతుపవనాలపై పడే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే వ్యవసాయ రంగం పై తీవ్ర ప్రభావం పడే ప్రమా దం ఉంది. అయితే ప్రస్తుతం పంటలు ఎండిపోవడానికి ఎల్ని నో ఒక్కటే కారణం కాదు. స్థానిక వర్షపాతం, నేలలో తేమ, సాగునీటి లభ్యత కూడా కీలకమే.
విద్యుత్ కోతలతో ఇబ్బందులు
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సక్రమంగా సరఫరా కాకపోవడంతో మోటార్ల ద్వారా పంటలకు నీరు అందించడం కష్టంగా మారుతోందని రైతులు చెబుతున్నారు. నీరు అందక పంటలు వాడిపోతుండటంతో పెట్టిన పెట్టుబడులు వృథా అవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.