సన్న బియ్యానికి కరువు సెగ!
- మేల్కొనకపోతే సర్కార్‌కు తిప్పలే
- ఇతర రాష్ట్రాల వ్యాపారుల రంగప్రవేశం
- కళ్లాల్లోనే రైతుల నుంచి నేరుగా కొనుగోలు
- మద్దతు ధర కంటే 50 శాతం అధికంగా చెల్లింపు
- మార్చి నాటికి సివిల్ సప్లు నిల్వలు ఖాళీ!
- ఎఫ్‌సీఐ గోదాముల్లోని స్టాక్‌ను దక్కించుకోవాలి
- వచ్చే వానాకాలం వరకు ముందస్తు ప్రణాళిక తప్పనిసరి
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాం): ఎం తో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ పథకం(Fine rice distribution scheme) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. రైతుల నుంచి కనీస మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించి సన్నరకం ధాన్యం సేకరిస్తున్నప్పటికీ, ఈ వానాకాలం సీజన్‌తో పా టు యాసంగి సీజన్‌లోనూ ఆశించిన స్థాయిలో ధాన్యం లభించకపోయే పరిస్థితులు ఎదరయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తో ఈసారి ధాన్యం దిగుబడి గణనీయం గా తగ్గే అవకాశలున్నాయని, ఆ పరిస్థితులు క్షేత్రస్థాయి లో కనపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా సన్నబియ్యానికి డిమాండ్ మరిం త పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారు లు సైతం తెలంగాణలోని కళ్లాల వద్దే నేరుగా రైతుల నుంచి సన్న ధాన్యం కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే లక్ష్యానికి అనుగుణంగా సన్నధాన్యాన్ని సేకరించడం ప్రభుత్వానికి కష్టతరమ య్యే ప్రమాదం ఉంది. తద్వారా సన్నబియ్యం పంపిణీ పథకానికి ఇబ్బందులు తలెత్తే ప్రమా దం లేకపోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేల్కొనాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రంగంలోకి ఇతర రాష్ట్రాల వ్యాపారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా క్వింటాలు సన్నరకం ధాన్యానికి రూ. 500 బోనస్ చెల్లిస్తూ కొనుగోలు చేస్తోంది. ఈయేడు సన్న రకం ధాన్యానికి రూ. 2461 కనీస మద్ధత్తు ధర (ఎంఎస్‌పీ)గా చెల్లిస్తోంది. దీనికి రూ. 500 బోనస్ ను జోడిస్తే.. క్వింటాలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2961 చెల్లిస్తోందన్నమాట. అయితే రాబోయే రోజుల్లో సన్నబియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో ప్రైవేటు వ్యాపారు లు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణ వైపు పరుగులు పెడుతున్నారు.
ముఖ్యంగా ఇప్పటికే వరికోతలు ప్రారంభమైన ఉమ్మడి నిజామాబా ద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, తదితర జిల్లాల్లోకి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనా డుకు చెందిన ప్రైవేటు వ్యాపారులు క్యూ కడుతున్నారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉండ టంతో.. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలు ధాన్యానికి సుమారు రూ. 3900 నుంచి రూ. 4,400 వరకు ధర చెల్లిస్తూ.. క ళ్ళాల నుంచే తరలించుకుపోతున్నారు. అవికూడా పచ్చిగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తున్నారు.
అంటే ఎంఎస్‌పీ కంటే సుమారు 40 నుంచి 50 శాతం వరకు ఎక్కువగా ప్రైవే టు వ్యాపారులు ధరను ఎక్కువగా చెల్లిస్తున్నారు. దీనితో ఈసారి నిర్దేశించుకున్నమేర కు ప్రభుత్వం సన్నరకం ధాన్ని కొనుగోలు చేస్తుందా.. అసలు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారా అనేది అనుమానాస్పదంగానే కనపడుతోంది.
తరిగిపోతున్న సన్న బియ్యం నిల్వలు
ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందిస్తో న్న ప్రభుత్వం సన్న బియ్యం నిల్వలు తరిగిపోతుండటంపై దృష్టి సారించాలి. వచ్చే సంవత్సరం మార్చి నాటికి సరిపోయినన్ని సన్న బియ్యం నిల్వలు సివిల్ సప్లు పరిధిలో ఉన్న గోదాముల్లో ఉన్నాయి.
అయితే ప్రస్తుతం చేతికొచ్చిన వానాకాలం పంట, తరువాత వచ్చే రబీ సీజన్‌లో ప్రభుత్వ అంచనాల మేరకు సన్న రకం ధాన్యం రాకపోతే.. ఈ నిల్వలు పూర్తిగా అడుగంటడం ఖాయంగా కనపడుతోంది. అప్పుడు ప్రజా పంపిణీకి సరిపోయినన్ని సన్నబియ్యం అందుబా టులో లేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇతర రాష్ట్రాలకు సరఫరా
సివిల్ సప్లుతైపాటు.. మన రాష్ట్రంలో పండించిన సన్నరకం ధాన్యాన్ని బియ్యంగా చేసి ఎఫ్‌సీఐకి కూడా అప్పగించారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో కొంత వరకు సన్న బియ్యం నిల్వలు ఉన్నాయి. తాజాగా ఇతర రాష్ట్రాల అవసరాలకు ఎఫ్‌సీఐ సన్నబియ్యం నిల్వలను సరఫరా చేస్తోందని సమాచా రం. ఎప్పటిలాగే ఇక్కడి గోదాముల్లో ఉన్న బి య్యం నిల్వలను ఎఫ్‌సీఐ తరలిస్తున్నప్పటికీ.. అందులో సన్నబియ్యంకూడా ఉండటం ఇక్కడ గమనార్హం.
ఒకపక్క సన్న రకం ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరకు కొనుగోలు చేసి తరలించుకుపోతుంటే.. లక్ష్యం మేరకు ప్రభుత్వం సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. భవిష్యత్తులో ప్రజలకు పంపిణీ చేసేందుకు సన్న బియ్యం కొరత ఏర్పడితే ఎలా అనే ప్రశ్నకు.. ఎఫ్‌సీఐనే సమాధానంగా నిలుస్తోంది.
ఎఫ్‌సీఐ నుంచి సేకరించాలి
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యానికి భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. ధరలుకూడా అదే స్థాయిలో పెరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం సన్న బియ్యాన్ని సేకరిద్దామన్నా కుదరదు. ఈ నేపథ్యంలోనే ముందు గా ప్రభుత్వం మేల్కొని.. ఎఫ్‌సీఐ వద్ద ఉన్న సన్నబియ్యం నిల్వలను ప్రభుత్వమే కొనుగోలుచేయాలి. బహిరంగ మార్కెట్లోని ధర కంటే.. ఎఫ్‌సీఐ ధరలు తక్కువగానే ఉంటా యి.
ఈ లెక్కన ప్రభుత్వంపై అధిక భారం పడదు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల అవసరాలకు తరలిస్తున్న సన్న బియ్యాన్ని అడ్డుకోవా లి. ప్రభుత్వమే కొనుగోలు చేసి.. అవి గోదాముల్లో నిల్వ చేయవచ్చు. మన భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
వచ్చే వానాకాలం వరకు..
ఎల్‌నినో ప్రభావం వచ్చే వానాకాలం వరకు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే వచ్చే 2027 వానాకాలం పంట రావాలంటే ఇంకా సంవత్సర కాలం ఉంది. మరి అప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థకు కావాల్సినంత సన్న బియ్యా న్ని భద్రపర్చుకో వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సివిల్ సప్లు పరిధిలో ఉన్న నిల్వలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. బహుశా మార్చి చివరి నాటికి సరిపోతాయని అధికారవర్గాల సమాచారం.
మరి 2027 మార్చి నుంచి నవంబర్, డిసెంబర్ వరకు సన్నబియ్యం కావాలంటే.. ఇప్పుడు ఎఫ్‌సీఐ వద్ద ఉన్న కొద్ది పాటి నిల్వలనైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. వాటికి తోడు.. ప్రస్తు త వానాకాలం, వచ్చే రబీల్లో అంతో ఇంతో వచ్చే సన్నరకం ధాన్యంతో నెట్టుకురావాలి. అప్పుడే సన్నబియ్యం పంపిణీ వ్యవస్థ గందరగోళానికి, ఒడిదుడుకులకు గురికాదు. ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో సన్నబియ్యానికి తిప్పలు తప్పేలా లేవు.